అర్ధ రాత్రి ఎర్ర చీరలో దెయ్యం బండిని ఆపి లిఫ్ట్ అడిగితే, తెలుగు భయపెట్టే దెయ్యం కథ|Telugu deyyam katha,yerra cheeralo deyyam

అమావాస్య అర్ధరాత్రి - ఎర్ర రుమాలు తెచ్చిన ఉపద్రవం

రామగోపాలపురం గ్రామ యూత్ లీడర్ రమణకు చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. ఆ సమయంలో అనుకోకుండా ఒక అత్యవసర పని మీద రమణ పక్కనే ఉన్న ముప్పాళ్ళపాడు గ్రామానికి వెళ్ళవలసిన అవసరం వొచ్చింది. 

ప్రధాన రహదారి గుండా వెళ్తే చాలా దూరం అవుతుంది. రోజంతా తిరిగిన అలసట వల్ల తన నిద్రను పాడుచేసుకోకూడదని రమణ భావించాడు. 

ఎలాగైనా తొందరగా చేరుకోవాలనే ఆలోచనతో మట్టి, కంకర రాళ్లతో నిండి ఉన్న  ఒక పాత షార్ట్‌కట్ దారిని ఎంచుకున్నాడు. ఆ దారి ఎగుడుదిగుడుగా, నిర్మానుష్యంగా ఉండటం వల్ల రాత్రి వేళల్లో ఆ దారి గుండా వెళ్లడానికి అంతగా ఎవరూ సాహసం చేయరు.

పైగా రమణ బైక్ హెడ్‌లైట్ వెలుతురు చాలా మసకగా  కేవలం నాలుగడుగుల దూరం మాత్రమే దారి కనిపిస్తోంది. 

సమయం 12:30 అయింది. సరిగ్గా అదే సమయంలో అమావాస్య తిథి ప్రారంభం కానుంది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది.

 రమణ గుంతలను తప్పిస్తూ బైక్‌ను నెమ్మదిగా నడుపుతుండగా, దారికి సరిగ్గా నడిమధ్యలో ఒక ముదురు ఎరుపు రంగు రుమాలు పడి ఉండటం కనిపించింది.

రమణ బైక్‌ను పక్కకు తిప్పే లోపే, బైక్ ముందు చక్రం నేరుగా ఆ ఎర్రటి రుమాలుపై నుంచి దూసుకుపోయింది. సరిగ్గా అదే క్షణంలో, ఆకాశంలో మెరుపుల్లేకుండానే పిడుగు పడినట్లు పెద్ద శబ్దం వచ్చింది.  తన బైక్ వెనుక సీటుపై ఎవరో బరువుగా కూర్చున్నట్లు రమణకు గట్టిగా అనిపించింది.

వెనుక అద్దంలో చూసిన రమణ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. తెల్లటి విరబోసుకున్న జుట్టుతో ఉన్న ఒక ఎర్ర చీర దయ్యం బైక్ వెనుక కూర్చుని ఉంది. 

మరుక్షణంలోనే అది మంచులా చల్లగా ఉన్న తన రెండు చేతులతో రమణ ఛాతీని వెనుక నుంచి బలంగా కౌగిలించుకుంది.

తీవ్రమైన భయంతో రమణ, "అయ్యో! ఇదేమి దయ్యం రా బాబూ!" అంటూ ఒక్కసారిగా గట్టిగా కేక వేశాడు.

కంగారులో రమణ ఆలోచించకుండా సడెన్ బ్రేక్ వేశాడు. కంకర రోడ్డుపై బైక్ అదుపుతప్పి జారిపడింది. రమణ బండితో సహా దూరంగా దొర్లి పడిపోయాడు. అతని చేతులు, మోకాళ్లకు రాపిడి తగిలి చర్మం లేచిపోయి  కాస్త మంట మొదలైంది.

చీకట్లో మొరాయించిన బైక్ - ఒళ్లు గగుర్పొడిచే నిశ్శబ్దం

బైక్ పైనుంచి కిందపడిన రమణ దాదాపు రెండు నిమిషాల పాటు తీవ్రమైన షాక్కు  కి గురై నేలపైనే ఉండిపోయాడు. అసలు ఏం జరిగిందో, తాను ఎలా కిందపడ్డాడో, తనను తాకింది ఎవరో అతనికి ఏమీ అర్థం కాలేదు.

ఒంటిపై తగిలిన చిన్న చిన్న దెబ్బలు  మంటపుడుతున్నాయి. అయితే ప్రమాదం వల్ల కలిగిన ఆ షాక్ మరియు నొప్పి వల్ల, బైక్ వెనుక కూర్చున్న ఆ దయ్యం గురించి రమణ పెద్దగా ఆలోచించలేకపోయాడు. బహుశా చీకటి, అలసట వల్ల కలిగిన భ్రమ అయి ఉంటుందని అనుకున్నాడు.

గుండె దడదడలాడుతుండగా రమణ ధైర్యం తెచ్చుకుని, వణుకుతున్న కాళ్లతో లేచి కిందపడిన బైక్‌ను పైకి లేపాడు. ఇంజిన్ స్టార్ట్  చేయడానికి కిక్ కొట్టాడు. బైక్ నుంచి త్రర్ర్... త్రర్ర్... అని శబ్దం వచ్చి ఆగిపోయింది.

పెట్రోల్ సరిగ్గా అందడం లేదేమోనని ట్యాంక్‌ను అటూ ఇటూ ఊపాడు. మళ్లీ గట్టిగా కిక్ కొట్టాడు. ఈసారి కూడా త్రర్ర్... త్రర్ర్... త్రర్ర్... అంటూ మూడుసార్లు శబ్దం చేసి బైక్ మళ్లీ ఆగిపోయింది.

నాలుగు, ఐదు సార్లు విరామం లేకుండా ప్రయత్నించి రమణ బాగా అలసిపోయాడు. నుదుటి మీద చెమటలు పట్టాయి. నిర్మానుష్యమైన ఆ దారిలో అర్ధరాత్రి వేళ ఒంటరిగా చిక్కుకుపోవడం అతనిలో ఆందోళన కలిగేలా చేసింది.

ఇక లాభం లేదనుకుని, ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులెత్తి, "ఓ భగవంతుడా! నన్ను ఇక్కడి నుంచి ఎలాగోలా గట్టెక్కించు, ఈ బండిని ఎలాగైనా స్టార్ట్ చెయ్యి స్వామీ!" అని వేడుకున్నాడు.

ఆవేశంతో , భయంతో కిక్ రాడ్‌పై ఒక బలమైన తన్ను తన్నాడు.

ట్రర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్...!

ఇంజిన్ ఒక్కసారిగా పెద్ద  శబ్దంతో స్టార్ట్ అయింది. రమణ క్షణం కూడా ఆలోచించకుండా యాక్సిలరేటర్ ఇచ్చి ముప్పాళ్ళపాడు వైపు బైక్‌ను పరుగో పరుగున తొలాడు.

అర్ధరాత్రి 2:30 గంటలకు డాక్టర్ ఆడమ్ క్లినిక్

ముప్పాళ్ళపాడు గ్రామం చేరుకునేసరికి సమయం సరిగ్గా రాత్రి 2:30 గంటలైంది. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయి ఉంది. రమణ నేరుగా గ్రామంలోని స్థానిక ఆర్.ఎం.పి (RMP) డాక్టర్ ఆదాము ఇంటికి వెళ్లి తలుపును గట్టిగా దబా ధబా బాదాడు.

కాసేపటికి డాక్టర్ ఆదాము నిద్రకళ్లతో తలుపు తెరిచాడు. ఎదురుగా బట్టలు నలిగిపోయి, దుమ్ముకొట్టుకుపోయి, ఒళ్లంతా చిన్న చిన్న రాసుకలతో ఉన్న రమణను చూసి ఆయన షాక్ అయ్యాడు.

డాక్టర్ ఆదాము: "అరేయ్ రమణా! ఏమైంది రా? ఇంత అర్ధరాత్రి పూట ఇలాంటి స్థితిలో వచ్చావ్? అంతా క్షేమమేనా? ఎవరైనా దాడి చేశారా?"

రమణ: "అంతా బాగానే ఉంది ఆదాము అన్న. మా ఊరి నుంచి ఇక్కడ కృపాల్‌ను కలవడానికి వస్తుండగా, షార్ట్‌కట్ దారిలో కంకర రాళ్ల వల్ల బైక్ స్కిడ్ అయి పడిపోయాను. ఒళ్లంతా గీసుకుపోయింది. కొంచెం శుభ్రం చేసి మందు రాయవా అన్న, చాలా మంటగా ఉంది."

డాక్టర్ ఆదాము: "అయ్యో, దీనికి అడగాలా ఏంటి తమ్ముడూ! రా ముందు లోపలికి వచ్చి కూర్చో. కాస్త మంచినీళ్లు తాగి కుదార్త పడు."

డాక్టర్ ఆదాము రమణను కూర్చోబెట్టి, గాయాలను క్లీన్ చేసి, యాంటీసెప్టిక్ ఆయింట్‌మెంట్ రాసి కట్టు కట్టాడు. నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్, ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ మాత్రలు ఇచ్చాడు.

కట్టు కడుతూ డాక్టర్ అడిగాడు, "అయినా ఇంత అర్ధరాత్రి వేళ కృపాల్ దగ్గరకు రావాల్సిన అవసరమేంటి?"

రమణ: "మా కొత్త ఇంటి పనుల కోసం కృపాల్ దగ్గర కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు, వైరింగ్ సామాన్లు ఉన్నాయి. ఉదయం 6 గంటలకే ఎలక్ట్రీషియన్ వస్తున్నాడు. నేను తెల్లవారుజామున బయలుదేరితే ఆలస్యమై ఆ ఎలక్ట్రీషియన్ వేరే సైట్‌కి వెళ్లిపోతాడు. అందుకే రాత్రే సామాన్లు తీసుకెళ్దామని వచ్చాను."

డాక్టర్ ఆదాము: "పని సరేలే కానీ, ఈ రాత్రిపూట ఆ పాడుబడ్డ దారుల్లో జాగ్రత్తగా తిరగాలి. మందులు ఇచ్చాను కదా, ఇక జాగ్రత్తగా వెళ్లు."

అక్కడి నుంచి బయలుదేరిన రమణ కృపాల్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ సామాన్లు సర్దుకుని, వేడి టీ తాగి కొంచెం కుదుటపడేసరికి తెల్లవారుజామున 4:00 గంటలైంది. రమణ ఆ ఎలక్ట్రికల్ సామాన్లు, వైర్లను బైక్ వెనుక కట్టుకుని మళ్లీ అదే షార్ట్‌కట్ దారిలో తిరుగు ప్రయాణమయ్యాడు.

వేకువజాము పొగమంచు - ఎరుపు రంగు చీర రహస్యం

సమయం దాదాపు ఉదయం 5:00 గంటలు కానుంది. చల్లని గాలి వీస్తోంది. వాతావరణంలో తెల్లటి పొగమంచు పరుచుకుని ఉంది. రాత్రి చీకటి నెమ్మదిగా విడిపోతూ, వేకువజాము వెలుగులు వచ్చేస్తున్నాయి.

ఊరు దాటి కొద్ది దూరం వెళ్లేసరికి, రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడి ఉన్న ఒక యువతి రమణను చూసి లిఫ్ట్ కోసం చేయి చాపింది. ఆమె ముదురు ఎరుపు రంగు చీర కట్టుకుని ఉంది. చీర కొంగుతో ముఖాన్ని పూర్తిగా కప్పుకుని ఉండటం వల్ల ఆమె రూపం సరిగ్గా కనిపించడం లేదు. ఆ సమయంలో ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరి మహిళను చూసి రమణ సర్లే ఎవరో ఏం అవసరమో అనుకోని బైక్ ఆపాడు.

రమణ: "ఏంటమ్మా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లాలి?"

యువతి: "ఎక్కువ దూరం కాదు . ఇక్కడే దగ్గర్లోని దాంతోరపల్లి నిమ్మతోటల వరకు వదిలేయండి చాలు. తోటలో కూలీ పనికి వెళ్లాలి, పొద్దున్నే 6 గంటలలోపు చేరి హాజరు వేయించుకోవాలి."

రమణ: "సరేనమ్మా, ఎక్కు. నేను కూడా అటువైపే వెళ్తున్నాను."

యువతి: "చాలా కృతజ్ఞతలు ." అంటూ నెమ్మదిగా బైక్ వెనుక కూర్చుంది.

ప్రయాణమంతా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిమ్మతోటల మలుపు దాటగానే రమణ బైక్ ఆపి, "ఇదిగోనమ్మా, మీ తోట వచ్చింది దిగు" అన్నాడు. ఆ యువతి ఏమీ మాట్లాడకుండా దిగి, చకచకా తోటల వైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది.

రమణ సమయం చూసుకుని బైక్‌ను వేగంగా పోనిచ్చి, ఉదయం సరిగ్గా 6:00 గంటలకు తన ఊరైన రామగోపాలపురం చేరుకున్నాడు. ఇంటికి రాగానే బైక్ పైనుంచి ఎలక్ట్రికల్ సామగ్రి అంతా దించి తన కొత్త ఇంట్లో భద్రంగా పెట్టాడు. రాత్రంతా పడ్డ ప్రయాస, తగిలిన గాయాల నొప్పులతో ఒళ్లంతా భారంగా అనిపించడంతో టవల్ తీసుకుని నేరుగా స్నానానికి వెళ్లాడు.

అయితే, అర్ధరాత్రి బైక్ కింద పడ్డ ఆ ఎర్రటి రుమాలుకు... వేకువజామున లిఫ్ట్ అడిగిన ఆ ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయికి మధ్య ఉన్న భయంకరమైన సంబంధం ఏమిటో రమణకు అస్సలు తెలియదు...

(మిగతా కథను రేపటి భాగం 2 లో చదవండి...)


© Copyright 2026 challagali Yesudas All Rights reserved 

Comments