మొబైల్ దెయ్యం | Telugu Story
మొబైల్ దెయ్యం | Telugu Story
గమనిక : కథ కేవలం కల్పితం ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇందులోని పాత్రలు సన్నివేశాలు పేర్లు ఎవరికీ సంబంధించినవి కావు ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రచయిత యొక్క ఊహనుంది ఊహించి రాయబడినది మాత్రమే
ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో నగరాలు, మరెన్నో పల్లెటూళ్లు ఉన్నాయి. అయితే మన కథ ప్రపంచంలోని ఒక మూల ఉన్న చిన్న గ్రామానికి చెందింది. ఆ ఊరి పేరు 'మేండక్ పూర్'. అక్కడే మన కథ మొదలవుతుంది.
పిల్లాడు.. వాడి అలవాటు
ఆ ఊళ్ళో టింకూ అనే 9 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. వాళ్ల నాన్న ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సీనియర్ అవ్వడం వల్ల జీతం నెలకు 35 వేల వరకు వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, దానికి తోడు అప్పుడప్పుడూ బయట చిన్న చిన్న పనులు చేయడం వల్ల నాలుగు కాసులే ఎక్కువే వస్తుంటాయి.
సంపాదన కాస్త బాగానే ఉండటంతో, ఆ తండ్రి తన కొడుకు టింకూను ఎంతో గారాబంగా పెంచుతున్నాడు.
కానీ, వాళ్ళ అమ్మ చేసే గారాబం ఇంకాస్త ఎక్కువే. దాని వల్ల ఆ పిల్లాడు పొద్దున్నే నిద్రలేవగానే ముందు మొబైల్ పట్టుకుంటాడు. అన్నం తినేటప్పుడు మొబైల్, పడుకునేటప్పుడు మొబైల్.. ఆఖరికి బాత్రూమ్ వెళ్లినా సరే చేతిలో మొబైల్ ఉండాల్సిందే!
టింకూకి ఉన్న ఈ పిచ్చి అలవాటు చూసి వాళ్ళ నాన్నకు విపరీతమైన వేదన మొదలైంది. 'వీడి భవిష్యత్తు ఏమైపోతుందో' అని లోలోపల ఆలోచించ సాగాడు.
టింకూ మొండితనం రోజురోజుకూ ఎక్కువ అయిపోతుంది. అప్పుడప్పుడు కోపం పట్టలేక వాళ్ల నాన్న ఏమైనా గట్టిగా అరిస్తే చాలు.. వాళ్ళ అమ్మ వెంటనే కొడుకుకి పత్తి పలుకుతూ వెనకేసుకొస్తుంది.
టింకూ వాళ్ల నాన్న: "ఏంట్రా ఎప్పుడూ ఆ మొబైల్ పట్టుకునే ఉంటావు? కాస్త చదువుకోవచ్చు కదరా! చదువు సంధ్యలు వదిలేసి ఎప్పుడూ ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటే.. పెరిగి పెద్దయ్యాక ఏం చేస్తావ్?"
టింకూ వాళ్ల అమ్మ: "మీరెప్పుడూ అంతే.. పసి పిల్లాడి మీద ఎందుకలా అరుస్తారు? వాడింకా చిన్న పిల్లాడే కదా, ఇప్పుడే వాడికి అన్నీ ఎలా అర్థమవుతాయి?"
టింకూ వాళ్ల నాన్న: "కాస్త బుద్ధుండాలి నీకు! నీ గారాబం వల్లే వాడు పాడైపోతున్నాడు. బయట పిల్లల్ని చూడు, ఎంత బాగా చదువుకుంటున్నారో. మన వాడేమో నిరంతరం ఆ ఫోన్కే అలవాటై పోయాడు. నీ అతి గారాబం వాడిని ఫోన్‌కి అడిక్ట్ చేసింది."
మొబైలా? లేక దెయ్యమా?
ఇంత చిన్న వయసులో ఆ ఫోన్ పిచ్చి వాడికి ఏమాత్రం మంచిది కాదు. తండ్రిగా ఆయనకు ఆందోళన ఉన్నా, ఏం చేయగలడు? పని కోసం రోజుకు 12 గంటలు ఇంటికి దూరంగానే గడపాలి.
సాయంత్రం అలిసి పోయి ఇంటికి రాగానే నీరసంగా అన్నం తిని పడుకోవడానికే సమయం సరిపోతుంది. పొద్దున్నే మళ్లీ డ్యూటీకి పరుగు తీయాలి, కాస్త ప్రశాంతంగా నిద్రపోయే సమయం కూడా ఉండదు.
ఆ కాస్త సమయంలో కూడా తన భార్యతో "వాడిని ఆ మొబైల్ కి కాస్త దూరంగా ఉంచు" అని చెబితే, ఆమె దగ్గరి నుంచి ఎదురుదాడి మొదలవుతుంది.
టింకూ వాళ్ల అమ్మ: "మీకేం హాయిగా పొద్దున్నే వెళ్తారు, సాయంత్రం వస్తారు. అలా దొరల్లాగా రావడం, మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవడం. ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడైనా పట్టించుకున్నారా?
రోజంతా ఈ ఇల్లు నేనే చూసుకోవాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి, మార్కెట్‌కి వెళ్ళాలి. మీరేమో పొద్దున్నే వెళ్ళిపోయి, ఇంటికి రాగానే పడుకుంటారు.
ఈలోపు ఆ టింకూ గాడు నా ప్రాణాలు ఎంత తీస్తాడో మీకు తెలుసా? వాడిని భరించలేక నాకు చుక్కలు కనిపిస్తుంటాయి. దానికి తోడు మళ్లీ మీకు బట్టలు ఇస్త్రీ చేయాలి, మీకోసం ప్రత్యేకంగా వంటలు వండాలి."
టింకూ వాళ్ల నాన్న: "అరెరె.. నేను నీకేం స్పెషల్ వంటలు వండమని అడగలేదే! నాకోసం ప్రత్యేకంగా వండమని నేను ఎప్పుడూ చెప్పాను ?"
టింకూ వాళ్ల అమ్మ: "అనకేం, దొండకాయ తినరు, కాకరకాయ తినరు, బెండకాయ అంటే చిరాకు, వంకాయ అంటే అస్సలు పడదు. మీకోసం రోజూ ఆ పప్పు స్పెషల్‌గా వండాల్సిందే కదా!"
టింకూ వాళ్ల నాన్న: "బాబోయ్, నేనేదో రాజభోగాలు అడగట్లేదు కదా! నేను తినేది చాలా సాదాసీదా భోజనం. రోజూ కాస్త పప్పు ఉంటే చాలన్నాను. అయినా ఇదంతా కాదు కానీ, ఆ పిల్లాడి సంగతి మీరే చూసుకోండి."
పాపం.. ఆ తండ్రి లోపలి బాధ
రోజూ భార్య వేసే ఈ నిందలు భరిస్తూ పాపం ఆ తండ్రి మాత్రం ఏం చేయగలడు? అటు భార్య మీద గట్టిగా అరవలేడు, ఇటు కొడుకుని ఏమీ అనలేడు. పొరపాటున కొడుకుని గట్టిగా "ఏంట్రా టింకూ, రోజంతా ఆ ఫోన్ పట్టుకునే ఉంటావా, ఎప్పుడు మారతావురా నువ్వు?" అని ఒక్క మాట అంటే చాలు, వెంటనే భార్య రంగంలోకి దిగుతుంది.
"ఎందుకలా పిల్లాడి మీద అనవసరంగా అరుస్తున్నారు? వాడు పసివాడు, కాసేపు ఆడుకోనివ్వండి. మీరు ఆఫీసులో కోపాన్నంతా తీసుకొచ్చి ఇక్కడ మా ఇద్దరి మీదా చూపిస్తున్నారు. పైకి వాడిని అరుస్తున్నా, లోపల మీరు నన్నే కదా తిడుతున్నారు?" అంటూ మొదలుపెడుతుంది.
అంతేకాదు, "నేను మీకోసం ఎంత చేసినా అంతే, ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. నా మీద మీకు కొంచెం కూడా ప్రేమ లేదు," అంటూ ఏడుస్తూ అలిగి కూర్చుంటుంది.
దెబ్బకు ఆ రోజు ఆయనకు ఇంట్లో భోజనం కూడా దొరకక బయటే తిని రావాల్సి వస్తుంది.
లోలోపల ఆయన కుమిలిపోతూ ఇలా అనుకుంటాడు...
"అసలు నేను ఏం చేయాలి? వీళ్ల కోసమే కదా నేను రాత్రింబవళ్లు కష్టపడుతున్నాను!
ఎండనక, వాననక వాళ్ళ కడుపు నింపడానికే కదా నా ఆరాటం అంతా. ఇంత చేసినా ఇంట్లో వీళ్ళ చేత మాటలు పడాల్సిందేనా?
పరిస్థితి ఇలాగే ఉంటే ఆ టింకూ గాడి భవిష్యత్తు గందర గోళం అయిపోతుంది.
ఈవిడ ఎప్పుడు మారుతుందో ఏమో! వాళ్ళకి చెప్పీ చెప్పీ అలసిపోయాను. నా పరిస్థితి ఇప్పుడు 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి' లాగా తయారైంది. ఎటు వెళ్లినా మునిగిపోయేది నేనే కదా!"
మరి ఆ తర్వాత ఏం జరిగింది? టింకూ మొబైల్ వ్యసనం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? ఆ తండ్రి వేదన తీరిందా లేదా? ఈ ఎమోషనల్ కథ రెండవ భాగంలో చదువుదాం. ఇలాంటి మరెన్నో కథల కోసం నా బ్లాగ్‌ని ఫాలో అవ్వండి.
ఒక రాణి ఆమె పేరు వాస్తవిక అద్భుతమైన కథ మీకోసం ఎంతో అందంగా నా హృదయం తో అలంకరించి రాశాను దయచేసి ఇక్కడ క్లిక్ చేసి చదవండి చాలా బాగుంటది
మొబైల్ దెయ్యం భాగం రెండు కోసం ఈ లింక్ ఈ కథ యొక్క పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉
© Copyright challagali Yesudas All Rights reserved
Comments
Post a Comment